భారతదేశానికి ఐదవ మొగల్ చక్రవర్తి షాజహాన్. జహంగీరు కుమారుడు. షాజహాన్ అసలు పేరు ఖుర్రమ్. నూర్జహాన్ సోదరుడు అసఫ్ ఖాన్ కుమార్తె ఐన ముంతాజ్ మహల్ ను పెండ్లిచేసుకుంటాడు.
ముప్పై సంవత్సరాల పాటు శాంతి భద్రతలను రక్షిస్తూ గొప్ప పరిపాలనా దక్షుడుగా పేరుతెచ్చుకున్నాడు. ఇతని కాలంలోనే మొగల్ సామ్రాజ్యం పతాకస్థాయిలో విస్తరించింది.
శిస్తు వసూళ్లు పుష్కలంగా ఉండటంతో రాజ్యం ఐశ్వర్యవంతమైనది. ఇతను గొప్ప కళాపోషకుడు. సుందరమైన భవన నిర్మాణాలు, కళాసాహిత్య పోషణకు ఎక్కువగా ఖర్చుపెట్టాడు. ప్రపంచ ప్రసిద్ధి పొంది నాదిర్షా చేత దోచుకోబడ్డ నెమలి సింహాసనం షాజహాన్ కాలంలోనే రూపొందించబడ్డది.
ముస్లిం న్యాయ స్మృతిని అనుసరించి పండితుల అభిప్రాయాలను తీసుకుని తీర్పులిచ్చేవాడు. కానీ మతసహనం లేని మత దురహంకారి. సిక్కుమతస్థులను హింసించి చంపించాడు. మొగల్ సామ్రాజ్యాన్ని తన 31 సంవత్సారాల పాలనలో ఉన్నత స్థితికి తీసుకు వచ్చాడు.
తన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్ధం ప్రపంచ ప్రసిద్ధి చెందిన కట్టడం తాజ్ మహల్ ను, ఆగ్రాలో యమునా నదీతీరంలో కట్టిస్తాడు.
ఇతని నలుగురు కుమారులు. ఇద్దరు కుమార్తెలు. జహనారా పెద్ద కుమార్తె. రోషనారా రెండవ కుమార్తె. పెద్ద కుమారుడు దారాషుకో ఆద్యాత్మిక చింతన కలవాడు. మతసహనం కలిగినవాడు.
హిందూ వేదాంతం, పురాణాలను అధ్యయనం చేసాడు. ఇతని మిగతా పుత్రులు షుజా, మురాద్, ఔరంగజేబ్. వీరిలో ఔరంగజేబ్ పరమ దుర్మార్గుడు. తన తండ్రిమీద తిరుగుబాటు చేసి షుజాను అడవులలోకి తరిమివేసి, దారా షుకోను, మురాద్ ను చంపి, తండ్రిని కారాగారంలో బంధించి అధికారంలోకి వస్తాడు.